6:18 AM

గుజరాత్ మోఢేరా సూర్య దేవాలయం

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోఢేరా సూర్య దేవాలయానికి తీసుకువెళుతున్నాం. అహ్మదాబాద్‌నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్ సోలంకి-I నిర్మించారు. క్రీస్తు పూర్వం 1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది. గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే ' అహిల్‌వాడ్ పాటణ్ ' కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది.
తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు.
కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు.
ఈ విధంగా మోఢేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో మూడు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్‌లోని మోఢేరాకు చెందిన సూర్య మందిరం

శిల్పకళలకు కాణాచి అయిన ఈ ఆలయంలో ప్రపంచప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్‌దేవ్ నిర్మించారు. ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం. మందిర గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగుల 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది.మందిరంలోని సభా మండపంలో మొత్తం 52 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు, పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం, మహాభారతంలోని ప్రధానమైన విషయాలనుకూడా చెక్కారు. స్థంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి.
సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.
చరిత్రలో మోఢేరా మందిరం...
స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాలననుసరించి ప్రాచీనకాలంలో మోఢేరా చుట్టుప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మరన్య' అని పిలిచేవారు. శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపంనుంచి బయట పడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెపుతున్నాయి. అప్పుడు గురువైన వశిష్ట మహర్షి ' ధర్మరన్య' వెళ్ళమని శ్రీరామ చంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలవబడుతోంది.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం : మోఢేరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్‌నుంచి 102 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్‌నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది. రైలు మార్గం : అహ్మదాబాద్ వరకు రైలు మార్గంగుండా ప్రయాణించి ఆ తర్వాత బస్సు లేదా టాక్సీలలో ప్రయాణించాలి. వాయు మార్గం : అహ్మదాబాద్ విమానాశ్రయం.

0 comments:

Post a Comment