6:02 AM

ఇతరులను దూషించకండి.

ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇతరులను దూషించడం మంచిది కాదు. కోపం, విచారం, ఈర్ష్య, ద్వేషం లాంటివి ఫెంగ్‌షుయ్ ప్రకారం ఉండకూడదని నిపుణులు అంటున్నారు. కొంతమందికి ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అలాగే ఇంకొంత మందికి ఎదుటివారిని గురించి ఫిర్యాదు చేసే స్వభావముంటుంది. మరికొందరైతే ఇతరులను సులభంగా నిందించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఇతరులు పైకి ఎదుగుతుంటే విచారంలో కుళ్ళిపోయేవాళ్ళూ చాలా మంది ఉంటారు. ఇలాంటి వ్యతిరేక భావాలను దూరంగా ఉంచడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఈ భావాలు మనలో ఉంటే, అవి ఇంటి నిండా ప్రతికూల శక్తిని సృష్టిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.ఎక్కడ మనం సంతోషంగా, హృదయ నిర్మలంగా ఉంటామో.. అన్ని అనుకూలంగా సాగుతాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మన హృదయాలు స్వచ్ఛంగా ఉంటే అక్కడ "చీ" శక్తి సైతం ఎంచక్కా ఇంటి నిండా తిరుగుతుంది. ఈ "చీ" ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేని పక్షంలో ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అందుకే మీ పిల్లల మీద, శ్రీమతి లేదా శ్రీవారి మీద అకారణంగా అరవకండి. ఆగ్రహాన్ని తగ్గించుకుని వీలైనంతవరకు మృదువుగా మాట్లాడడం చేస్తే "చీ" శక్తి సకల సంతోషాలనిస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అలా గాకుండా మీరు కోపంగా, ఆగ్రహంతో ఉంటే ఇంట్లో చెడ్డ చీ శక్తి తిరుగుతూ, సమస్యలకు నిలయమవుతుందని వారు పేర్కొంటున్నారు.

0 comments:

Post a Comment