3:03 AM

వ్యక్తిత్వ వికాసం అంటే

వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. వ్యక్తిత్వం లేకపోతే మనిషి ఇతరులపై ఆధారపడవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడ్డప్పుడు మనిషికి గౌరవం వుండదు. గౌరవం లేని వ్యక్తి జీవితం దుఃఖమయమవుతుంది. దుఃఖం మనిషిని జీవితాంతం మానసికంగాను, శారీరకంగానూ కృంగదీస్తుంది. అందువల్ల వ్యక్తిత్వానికి అంత ప్రాముఖ్యత వుంది మరి. ప్రతి మనిషి తనదంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిత్వం వల్లనే మానవుడు మహనీయుడు కాగలడు. విజయం పొందినవారు తమదంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని ఇతరులకు మార్గదర్శకంగా వున్నారన్న విషయం మనం కాదనలేము. స్వకీయమైన స్వధర్మంతో, వ్యక్తిత్వంతో పథకాలు వేసుకొంటూ సాగితే జీవితాశయాలను విజయవంతంగా కొనసాగించగలము. మనం చూడటానికి అందరికంటే అందంగా వుండకపోయినా అందరినీ ఆకర్షించగలిగిన విశిష్టమైన వ్యక్తిత్వం మనలో వుందన్న మాట. ఎదుటివారు మనల్ని చూచీ చూడటంతోనే వాళ్ళ మనసును ఆకట్టుకొని వాళ్లకు తృప్తిని కలిగించే నడవడిక కలిగివుండడమే వ్యక్తిత్వంలోని ప్రత్యేకత. వ్యక్తిత్వానికి రూప సౌందర్యం అక్కరలేదు. సత్శీలం, చక్కని వాక్చాతుర్యం, వినయ విధేయతలు, క్రమశిక్షణ మొదలైనవి వ్యక్తిత్వాన్ని సౌందర్యవంతం చేస్తాయి. సహజ స్వభావం కన్నా సహజ గౌరవమే అందుకు దోహదం కలిగించి మన జీవితాన్ని శోభాయమానంగా చేస్తుంది. మన వ్యక్తిత్వానికి మనమే కారకులం. ఇంకొకరు కాదు. ఇతరులతో మనకుండే సంబంధాన్ని మంచిదిగా మార్చుకోగలిగితే వ్యక్తిత్వాకర్షణ పెరుగుతుంది. మన గూర్చి కాదు, ఇతరులగూర్చి ఎక్కువగా పట్టించుకోవాలి. ఇతరులని శ్రద్దగా పరిశీలిస్తూ వుండాలి. వారితో తగిన రీతిలో ప్రవర్తిస్తూ వుండాలి. మన నడవడి, ప్రవర్తన మన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తాయి. ఎదుటివాళ్ళ సంక్షేమాన్ని గూర్చి, వాళ్ళ సుఖ దు:ఖాల గూర్చి వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి. మన ప్రత్యేకత మన వ్యక్తిత్వానికి పరిపుష్టినిస్తుంది. ఇతరులు కూడా మనవంటి మానవమాతృలే వాళ్ళలో కూడా లోపాలు, పొరపాట్లు, అవరోధాలు వుంటాయి. వాటిని సమరస్యభావంతో, సహన బుద్ధితో అంగీకరించడానికి మనం అభ్యాసం చేసుకోవాలి. తాను బాధపడక ఇతరులను బాధించక ముందుకు సాగిన నాడు మన వ్యక్తిత్వం వికసిస్తుంది. విశ్వమానవాళికి వ్యక్తిత్వ సుమ పరిమళాలను వెదజల్లుతుంది.

0 comments:

Post a Comment