ప్రతిదీ ఇష్టంగా చేయటమే..!
ఎంత పని ఒత్తిడిలో ఉన్నా... ఇతరేతర వ్యాపకాలలో మునిగి ఉన్నా.. తన కోసం రెండు కళ్లు ఎదురుచూస్తూ ఉంటాయన్న ఫీలింగే ప్రేమ. తనకేదయినా అయిన మరుక్షణం ఆ రెండు కళ్లు వాలిపోతాయన్న అనుభూతే ప్రేమ.
జీవితంలో ప్రేమ ఉన్నట్లుగానే... కోపం, అసహనం, అసూయ, కొంచెం ద్వేషం, మరికొంచెం ప్రళయం.. అన్నీ ఉంటాయి. అన్నీ ఉండటం కూడా ప్రేమే..! ఇవన్నీ ఉంటేనే అసలు ప్రేమ విలువ తెలిసేది. ఇవన్నీ సహజం అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి గనుకనే జీవితం వైవిధ్యభరితంగా ఉంటుంది.
భార్యాభర్తలు ఇద్దరూ తమలో తాము పేచీ పడాలి, గొడవపడాలి, రాజీపడాలి, కలసిపోవాలి. కలహానంతర కలయిక ఒక మధురానుభూతి, మధురాతి మధురం.
ఆఫీసు నుండి భార్యో, లేదా భర్తో ఆలస్యంగా వస్తే... ఆ ఆలస్యాన్ని అతని లేదా ఆమె జ్ఞాపకాలతో, తలపులతో ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలి. ఎందుకు ఆలస్యం అయ్యిందో అని తపన పడగలగాలి. ఎదురు చూస్తున్న వ్యక్తి ప్రత్యక్షమయిన మరుక్షణం ఆ తపనంతా ఎగిరిపోవాలి. దగ్గరకు తీసుకుని సానునయంగా ఒక్క స్పర్శ. అదే ప్రేమను నిరంతరం జ్వలింపజేసే ఒక ప్రక్రియ.
కారణాలు ఏవయినా కావచ్చు, మనుషులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ కాకపోవడమే అసలయిన ప్రేమ రాహిత్యం అని చెప్పవచ్చు. ప్రేమకు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. పది నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకుంటే, గుండెల నిండా పేరుకున్న భారం ఎగిరిపోతుంది. హృదయాలు తేలికవుతాయి.
ప్రేమకు, బానిసత్వానికి పెద్దగా తేడా లేదు. ఎదుటివారు చెప్పిన ప్రతిదీ ఇష్టంగా చేయటమే ప్రేమ. అయిష్టంగా చేయడం బానిసత్వం. అలా అని ప్రేమ బానిసత్వం కాదు. ఈ రెండింటి మధ్యా విభజన రేఖ తెలియక చాలామంది పెళ్లంటే దాస్యం అనుకుంటుంటారు. జీవితం అనే దీప శిఖకి పెళ్లి అనేది ప్రమిద అయితే ప్రేమ అనేది ఆధారం.
12:33 AM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment