జీతం ఎంతని అడగకూడదు. మీకు ఎంతో సన్నిహితులయి, నొచ్చుకోరనుకుంటే తప్ప ఇతరుల జీతం ఎంతో తెలుసుకోవాలనుకోవడం సముచితంకాదు. కొందరికి తమ జీతభత్యాల గురించి చెప్పడం ఇష్టం ఉండదు. కనుక సంపాదన విషయాలు ప్రశ్నించకూడదు.
ఆడవాళ్ళ వయసు కాదు, మగవాళ్ళ వయసు కూడా అడగకూడదు. అందం గురించి స్పృహ పెరిగిన ఈ కాలంలో ఎవరయినా తాము చిన్నవయసువాళ్ళమని తమ వయసు తెలియకుండా ఉండాలనుకుంటారు. కనుక వయసు గురించి పశ్నించడం సబబు కాదు.
ఆడవాళ్ళని ఫోను నెంబర్లు ఇవ్వమని, ఇంటి అడ్రసు చెప్పమని అడగకూడదు. ఏదో వంకతో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వారు చికాకు పడతారు.
ముప్పయి ఏళ్ళు దాటిన ఆడవాళ్ళని మీ వారు ఏంచేస్తుంటారు? మీకు ఎంతమంది పిల్లలు? అని అడగకూడదు. ఒకవేళ వారికి పెళ్ళి కాకపోయి వుంటే, పిల్లలు లేనట్టయితే మీ మాటలకు నొచ్చుకుంటారు. కనుక తొలి పరిచయంలో ఆ ప్రస్తావన తీసుకురాకూడదు.
మీకు పెద్దగా పరిచయం లేని వారిని అప్పు అడగకూడదు. చేబదుళ్ళయినా సరే తెలియని వారిని అడగటం భావ్యంకాదు.
పరిచయస్థుల్ని వారి భార్య లేదా భర్త గురించి ప్రశ్నించకూడదు. వారు చెబితే సరి. లేకపోతే వాళ్ళ బయోడేటా తెలుసుకోవాలనుకోవడం సరికాదు.
ఎంత మిత్రులయినా సరే వారి స్థిరచరాస్థుల గురించి ప్రశ్నించకూడదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అడగకూడదు. పేదరికం నుంచి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారు తమ స్థితిగతుల గురించి చెప్పడానికి ఇష్టపడరు. కనుక వాళ్ళని ప్రశ్నలతో వేధించకూడదు. వాళ్ళు చెబితే వినాలి లేదా ఊరుకోవాలి.
ప్రయాణాల్లో పరిచయమైన వారితో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయొద్దు. సాధారణమైన విషయాలు మాత్రమే మాట్లాడటం పద్దతిగా వుంటుంది.
ఇల్లు కట్టుకోవడం, పొదుపు చేయడం గురించి ఇతరులు అడగకముందే ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఇలాంటి విషయాల్లో అడగకముందే సలహాలు ఇచ్చేవారిని చూస్తే చాలా మందికి కోపం వస్తుంది. కనుక మీ హద్దులు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలి.
చేయకూడని పనులు
సమాజంలో మన ప్రవర్తన మనం మర్యాదస్తులమో కాదో తెలియజేస్తుంది. కనుక వ్యవహార సరళి సంస్కారం ఉట్టిపడే విధంగా ఉండాలి. ఇతరులకి ఇబ్బందిపెట్టని రీతిలో ఉండాలి. అందుకే మనం చేయకూడని విషయాలు ఏమిటో తెలిసిఉండాలి. ఆ విషయాలు తెలుసుకుందామా మరి.
ఇతరుల సెల్ నుంచి ఫోన్లు చేయాలనుకోవడం పద్దతి కాదు. అలాగే ఇతరుల సెల్ నంబర్‌ని వారి అనుమతి లేకుండా ఎవరికి ఇవ్వకూడదు. తమకు ఇష్టం లేనివారితో మాట్లాడాల్సి వస్తే వారు చిరాకు పడతారు. తమ సెల్ నంబర్ ఇచ్చిన వాళ్ళని తిట్టుకుంటారు.
మీరు ఇతరుల నుంచి తీసుకువచ్చిన పుస్తకాల్ని వేరొకరికి ఇవ్వకూడదు. వాటిని వారు సమయానికి తిరిగి ఇవ్వకున్నా, పోగొట్టినా మీరూ, మీకు పుస్తకాలు ఇచ్చిన వారూ ఇబ్బందిపడాల్సి వస్తుంది.
మీ బంధువుల ఇంటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా వారి బెడ్‌రూంలో పడుకోకూడదు ఒకటీ రెండు గదులు ఉంటే ఎలాగో తప్పదు. కానీ పక్కన హాలు ఉన్నప్పుడు వారి బెడ్స్ మీద పడుకోవడం మర్యాద కాదు. ఇలా చేస్తే మీకు సంస్కారం లేదనుకుంటారు. మర్యాద తెలియని మనుషులుగా పరిగణిస్తారు. అలాగే ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు వారి టవల్స్‌ని బట్టలని వారి అనుమతి లేకుండా వాడకూడదు. వారు ఇచ్చిన వాటిని మాత్రమే వాడాలి. స్వయంగా వారి టవల్స్, బట్టలు, సబ్బులు పక్కన పెడతారు. వాటిని మాత్రమే అందజేస్తారు. కనుక తమంతట తాము ఏ వస్తువుని ముట్టుకోకూడదు.
మీకు ఆతిధ్యం ఇచ్చిన వారి వంటకాలకి వంకలు పెట్టకూడదు. వాళ్ళకి సరిగా చేయడం రాదని ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే ఎవరికి తగిన పద్దతిలో వారు వండుకుంటారు. కనుక వారి వంటకాలు బాగోలేదని, వండటం రాదని అనడం తగదు.
ఇన్సూరెన్స్ చేయమని, చిట్టీలు కట్టమని ఎవరిని బలవంతం చేయకూడదు. ఎవరి ఆర్థికావసరాలు వారికి తెలుసు. కనుక వారిని ఒప్పించి తీరాలన్నట్టుగా వ్యవహరించడం మర్యాద కాదు.
పక్కవారి ఇళ్ళల్లోకి ఎవరు వచ్చి వెళుతున్నారని నిఘా వేయడం, వారి ఇంటికి వచ్చే వారి మీద కామెంట్స్ చేయడం తగనిపని. ఇలా వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకూడదు.
తమ ఇంటికి రావడం లేదని తమకు పెట్టిపోతలు సరిగా లేవని అయినవాళ్ళ మీద అలగకూడదు. వారు అలా చేస్తే అందుకు గల కారణాలు ఏమిటో గమనించాలి.
ఫోను చేయకుండా మిత్రుల ఇంటికిగానీ, బంధువుల ఇంటికి గానీ వెళ్ళకూడదు. వేరే పనుల మీద ఉన్నవారు ఆకస్మికంగా మిత్రులో, బంధువులో వస్తే ఇబ్బంది పడతారు. కనుక ఫోను సౌకర్యం ఉన్నవారి ఇంటికి ఫోను చేసి వెళ్ళడం పద్దతి.