ఇలాగ కూడా కలవనీయరా...?!
ప్రేమించటం, ఆ ప్రేమను పొందటంలో ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. అదే ప్రేమను కోల్పోయినవారి జీవితాలు శూన్యం అవుతాయనడానికి నిదర్శనంగా నిలిచాడు ఈ యువకుడు. అమర ప్రేమికుడు అవుదామనుకున్న ఇతగాడి ఆశ కూడా నెరవేరలేదు. "ఇలాగ కూడా మమ్మల్ని కలవనీయరా..?" అంటూ దీనంగా అడుగుతూ, కుమిలి కుమిలి ఏడుస్తున్న ఈ ప్రేమికుడి కథను వింటే మనకు కూడా కళ్లు చెమ్మగిల్లకమానవు.
ఇక వివరాల్లోకి వస్తే... పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన ముల్తాన్ అనే యువకుడు తన బంధువైన ఒక అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. ఏదేని పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకోలేని పక్షంలో జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. ఈలోపు ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లయిపోయింది. సర్లే అనుకుని మనసుకు సర్దిచెప్పుకుని బ్రహ్మచారిగానైనా మిగలాలని ముల్తాన్ అనుకున్నాడు.
అయితే.. ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం మరణించింది. దీంతో గుండె పగిలిన ముల్తాన్, ఎలాగైనా సరే ఆమెతో కలసి పైలోకాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా శ్మశానానికి వెళ్లి, తన ప్రేయసి సమాధి తవ్వి అందులో తాను సజీవంగా ఖననమయ్యాడు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ముల్తాన్ సమాధి అయ్యేందుకు ముందుగా నిద్రమాత్రలు కూడా మింగాడు.
కథనలా ఉంచితే... పూడ్చి ఉన్న సమాధిని మళ్లీ ఎవరో తవ్వినట్లుగా గమనించిన స్థానిక ప్రజలు దగ్గరికి వచ్చి చూశారు. లోపల ఓ మహిళ శవంతోపాటు అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉండటాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముల్తాన్‌ను రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ణి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తరువాత ఇతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
అయితే... ప్రేయసిని మాత్రం మరచిపోలేని ముల్తాన్ కుమిలి, కుమిలి ఏడుస్తున్నాడు. చావులోనైనా తన ప్రేమికురాలితో కలవాలన్న అతడి ఆకాంక్ష అలా భగ్నమైంది. కాగా, ఇతడిని బయటికి తీసిన తరువాత ప్రియురాలి సమాధిని యధావిధిగా పూడ్చివేసి, ఆమె ఆత్మ శాంతించాలని ప్రార్ధనలు చేశారు.
ముల్తాన్ ప్రియురాలి కుటుంబ సభ్యులు, అతడిని క్షమించి వదిలేయమని పోలీసులను కోరినప్పటికీ... చట్టప్రకారం అతడిపై చర్య తీసుకోక తప్పదని పోలీసులు అంటున్నారు. మరణంలోనైనా ప్రేయసికి తోడుగా వెళ్లాలనుకున్న ముల్తాన్ కోరిక నెరవేరకపోగా... పోలీసులు, జైళ్లు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి మాత్రం తప్పటంలేదు. పాపం.. ముల్తాన్... ప్రేయసి లేక, చావు రాక, చనిపోయే స్వేచ్ఛ లేక... పిచ్చి ప్రేమికుడిగా మాత్రం మిగిలిపోయాడు.
ప్రతిదీ ఇష్టంగా చేయటమే..!
ఎంత పని ఒత్తిడిలో ఉన్నా... ఇతరేతర వ్యాపకాలలో మునిగి ఉన్నా.. తన కోసం రెండు కళ్లు ఎదురుచూస్తూ ఉంటాయన్న ఫీలింగే ప్రేమ. తనకేదయినా అయిన మరుక్షణం ఆ రెండు కళ్లు వాలిపోతాయన్న అనుభూతే ప్రేమ.
జీవితంలో ప్రేమ ఉన్నట్లుగానే... కోపం, అసహనం, అసూయ, కొంచెం ద్వేషం, మరికొంచెం ప్రళయం.. అన్నీ ఉంటాయి. అన్నీ ఉండటం కూడా ప్రేమే..! ఇవన్నీ ఉంటేనే అసలు ప్రేమ విలువ తెలిసేది. ఇవన్నీ సహజం అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి గనుకనే జీవితం వైవిధ్యభరితంగా ఉంటుంది.
భార్యాభర్తలు ఇద్దరూ తమలో తాము పేచీ పడాలి, గొడవపడాలి, రాజీపడాలి, కలసిపోవాలి. కలహానంతర కలయిక ఒక మధురానుభూతి, మధురాతి మధురం.
ఆఫీసు నుండి భార్యో, లేదా భర్తో ఆలస్యంగా వస్తే... ఆ ఆలస్యాన్ని అతని లేదా ఆమె జ్ఞాపకాలతో, తలపులతో ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలి. ఎందుకు ఆలస్యం అయ్యిందో అని తపన పడగలగాలి. ఎదురు చూస్తున్న వ్యక్తి ప్రత్యక్షమయిన మరుక్షణం ఆ తపనంతా ఎగిరిపోవాలి. దగ్గరకు తీసుకుని సానునయంగా ఒక్క స్పర్శ. అదే ప్రేమను నిరంతరం జ్వలింపజేసే ఒక ప్రక్రియ.
కారణాలు ఏవయినా కావచ్చు, మనుషులు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ కాకపోవడమే అసలయిన ప్రేమ రాహిత్యం అని చెప్పవచ్చు. ప్రేమకు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. పది నిమిషాలు మనసు విప్పి మాట్లాడుకుంటే, గుండెల నిండా పేరుకున్న భారం ఎగిరిపోతుంది. హృదయాలు తేలికవుతాయి.
ప్రేమకు, బానిసత్వానికి పెద్దగా తేడా లేదు. ఎదుటివారు చెప్పిన ప్రతిదీ ఇష్టంగా చేయటమే ప్రేమ. అయిష్టంగా చేయడం బానిసత్వం. అలా అని ప్రేమ బానిసత్వం కాదు. ఈ రెండింటి మధ్యా విభజన రేఖ తెలియక చాలామంది పెళ్లంటే దాస్యం అనుకుంటుంటారు. జీవితం అనే దీప శిఖకి పెళ్లి అనేది ప్రమిద అయితే ప్రేమ అనేది ఆధారం.