2:26 AM

మానసిక వ్యభిచర్యమా?

"ఏమంటున్నావు?" నన్ను తలచుకో నేను ప్రత్యక్షమైతా అని "ముగ్గురు మాంత్రికులు" కథలో పింగళుడికి వరమిచ్చినట్టు వరమివ్వక పోయినా తన అవసరం ఉన్నప్పుడు ప్రత్యక్షరమవటం నా మనోజకు అలవాటే అని తెలిసిన నేను ఉన్నట్టుండి వినపడిన స్వరానికి ఉలికిపడక తాపీగా తన వైపు తిరిగాను.


"మనము చర్చించబోయే విషయానికి మానసిక వ్యభిచారమా అని నామకరణం చేశాను" నేను చెప్పాను జవాబు. అసలే సున్నితమైన విషయం అవటం వలన తనను చూడకుండా కళ్లు మూసే జవాబిచ్చాను, విషయంపై ఏకాగ్ర చిత్తునైనట్టు నటిస్తూ.


"నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా? నేను నీ మనోజను అంటీ నీ మనోజనితను. నువ్వు కళ్లు మూసుకొని ఏకాగ్ర చిత్తం నటించినా అది బయటి వారి వరకే కాని నీ లోపలి దాన్నైన నా దగ్గర చెల్లదు" అని వినపడ్డా కనులు తెరవలేదు నేను. "ఎంత పిరికి వాడివి!" కొంచం హేళన ధ్వనించింది తన గొంతులో "నీ మనోఫలకపు ప్రతిబింబాన్ని చూడడానికి కూడా ఎంత భయం" ఆన్న మాటలతో ఇంక లాభం లేదని కళ్లు తెరిచాను. ఎదురుగా కూర్చునుంది మనోజ. పాపి కొండల నడుమ దుడుకుతనం లేని గోదారిలా ఉంది స్వచ్చంగా, అందంగా, ఆకర్షణీయమైన ఆంద్ర అమ్మాయిలా.


తన వైపు తను ఒకసారి చూసుకొని "చ! ఎప్పుడూ ఈ లంగా వోణీలేనా? ఆంధ్ర అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగా వేస్తున్న బట్టలు ఏవో తెలీవా?" కొంచం గారాలు పోతూ అనింది. అచ్చు నా భార్య ఎపుడైనా తనకు ఏదైనా కావాల్సి వస్తే నా దగ్గర వాడే స్వరంలో. కొంచం చురుక్కుమనిపించిందేమో నా ఆ భావన "సరే సరే. నీకు ఇష్టమైన బట్టలు కాబట్టి ఇవే తగిలించుకుంటాలే. topic divert చేయకు. చెప్పు అసలు నీ ప్రకారం వ్యభిచర్యమంటే?" దొరికి పోయిన దొంగలా నన్ను టాపిక్ మార్చద్దంటూ తను టాపిక్ మారుస్తూ.



సర్దుకు కూర్చొని చెప్పసాగాను "పెళ్ళయిన తరవాత ఒక స్త్రీ లేదా పురుషుడు...." చెప్పబోతున్నంతలో ఆపి "అంటే పెళ్లి కాని వారు ఏది చేసినా అది వ్యభిచారమవదా?" తన ప్రశ్న. కొంచం బుర్ర గోక్కుని "కాదులే. ఒక స్త్రీ కాని పురుషుడు కాని, తనది కాని స్త్రీ పురుషులతో సంభోగిస్తే అది వ్యభిచారం" అని చెప్పాను. "అయితే ఇంక చర్చ దేనికి. నువ్వు ఇంతవరకు ఎప్పుడూ ఆ పని చేయలేదు. సో నువ్వు వ్యభిచరించనట్టే. పోయి పడుకో నేను వెళ్ళిపోతా. రాత్రి పన్నెందవుతోంది" అని వెళ్లి పోయింది .
ఏదో అసంతృప్తి నాలో ఆ మాట విన్న తరువాత. నన్ను నిర్దోషిగా తేల్చిన తన నిర్ణయం వల్ల కొంచం కూడా సంతోషం కలగలా నాకు. ఆ అసంతృప్తి తను వెళ్ళిపోతోంది అని కూడా కాదు. ఎందుకో మరి? అర్థం కాలేదు.


"నేను చెపుతాను విను" ఈసారి నిజంగానే ఏకాగ్రచిత్తుడనైన నేను కనులు తెరిచే ఉన్నా తన తిరిగు రాక గమనించక పోవటం వల్ల ఉలికిపడ్డా తన స్వరం విని. ఈసారి సాధారణ యువతిలా వేషధారణ పంజాబీ డ్రెస్సులో. సింపుల్గా కనపడుతున్నా ఇందాకటి కంటే ఇప్పుడు విలక్షణంగా ఉంది ఎందుకో మరి?


"ఎందుకంటే ఈసారి నీ మనస్సు నిర్మలంగా ఉంది, విలక్షణంగా మంచి విషయం గూర్చి ఆలోచిస్తున్నవుగా అందుకే." నవ్వి చెప్పసాగింది. "నీలోని ఆ అసంతృప్తికి కారణం అసలు జరగని మన చర్చ." అవును నిజమే అనిపించి మళ్ళీ మొదలెట్టా "కాదు, ఇందాక నేను చెప్పిన నిర్వచనం కాదు వ్యభిచర్యమంటే. నా దృష్టిలో వ్యభిచర్యమంటే ఒక స్త్రీ/పురుషుడు తనది కాని ఇంకో పురుషుడు/స్త్రీ సాంగత్యంలో సుఖించటం. ఆ సుఖించటం అనేది సంభోగం వలన కాని, సంభోగానాలోచనల వలన కాని వస్తే నీచాతి నీచము" ముగించాను నేను కొంచం తీవ్ర స్వరంలో.


"గుస్సా రంగయ్య, కోపం తగ్గయ్య కోపం మనిషికి......." అంటూ ఆకలి రాజ్యంలోని మధురమైన పాట వినిపించింది. ఎక్కడినుంచా అని చూస్తె మనోజ చలవ అది అని తెలిసి హాయిగా నవ్వేసా. అమ్మో బావుందే అనుకున్నప్పుడల్లా మంచి పాటలు వినొచ్చు ఆన్న ఆలోచన నా మదిలో మెదలగానే సమాధానంగా "లేదు. నువ్వు కమల్ హసన్ వి కాదు, నేను శ్రీదేవిని కాను. నీ మదిలో మెదిలిన పాటను నేను వినిపించాను అంతే. " అని చెప్పి మళ్ళీ ప్రశ్నించింది " అంటే స్త్రీ పురుషులిద్దరూ జీవితమంతా ఆనందం తమ భార్య లేదా భర్తా, ప్రేయసీ ప్రియులలోనే వెతుక్కోవాలా?" ఇంకెవరితోనూ ఆనందం పొందవద్దా?"


"అవును" అని చెప్పటం నాకే పరిహాసంగా అనిపించి ఊరకుండి పోయాను. "బ్రతికించావు పో. లేకుంటే తరవాత నువ్వు మనోజ పరిహాసనా స్వరంతో ఇలా అనింది అని మొదలెట్టాల్సి వచ్చేది" అని తను అంటూ ఉంటే ఉడుక్కోకుండా ఉండలేక పోయాను. "అదేమీ కాదు. స్త్రీలు తమ సఖిల వద్దా, పురుషులు తమ స్నేహితులవద్దా ఆ ఆనందం పొంద వచ్చు" అని నేనటమే తరువాయి "బాబు కాస్త ఆ నాలుగు తరాల కిందటి భాష ఆపుతావా లేదా?" అని వినిపించగా "అంటే తమ స్నేహితులతో ఆనందం పొందటంలో తప్పు లేదు అని చెప్పబోయాను" అన్నాను. వెంటనే కరకుగా తను "అయితే మరి ఏమిటి నువ్వు అనే వ్యభిచారం? వ్యభిచారమంటేనే నిర్వచించ లేని వాడివి మానసిక వ్యభిచారం గురించి ఆలోచించే మగాడివా?" అని ప్రశ్నించింది.


ఒక్క సారి పెల్లుబుకొచ్చిన కోపాన్ని అణచటం గగనమే అయింది. నన్ను, నా మగతనాన్ని ప్రశ్నించే అంతటిదా తను? ఆడపిల్ల అయి బ్రతికి పోయింది లేకుంటేనా అని సాగుతున్న నా ఆలోచనలను భగ్నం చేస్తూ వినిపించింది గంభీరంగా నా స్వరం నాకే "నేను ఆడపిల్ల కాదు. నేను నీవే. నీవెంత మగాడివో నేనూ అంట మగాడినే. నీ మగతనం ప్రశ్నించే నేను నా మగతనాన్ని గురించే ప్రశ్నించుకుంటున్నానని గమనించవేం?". అదేంటి అని తల ఎత్తి చూడగా ఎదురుగా నిలిచి నన్ను నేను ప్రశ్నించుకుంటున్న నేను నాకు అగుపడ్డాను. మాయా బజారులో టక్కున SVR సావిత్రిలా మారిపోయినట్టు నా మనోజ నా రూపం దాల్చి ఉంది అక్కడ.


ఖంగుతిన్నాను. "అవును కదా. తను నా మనమే కదా. అందుకే అంత తొందరపాటుగా నోరు జారటం, వెంటనే తప్పు తెల్సుకోవటం, బాధపడటం- ఇవన్నీ నా గుణాలే కదా? మరి నా గుణాలు నాకు ఎదురైతే కోపమెందుకు? అసలు నా మనానికి వేరే రూపెందుకు? ఎందుకు నా రూపులో నన్ను నేను ప్రశ్నించుకోను? సరే వేరే రూపు సృష్టించినా పురుష రూపమెందుకు రాలేదు? సమవయస్కురాలైన స్త్రీ రూపమెందుకు? ఇది కాదా వ్యభిచారము?" పరి పరి విధాల పోతున్న నా ఆలోచనలకు మళ్ళీ అడ్డం పడిందో స్వరం. కాకపొతే ఈసారి నా గార్ధభ స్వరం కాదు ఓ కోకిల స్వరం అది.


"ముమ్మాటికీ కాదు. నే చెపుతా విను వ్యభిచర్యమంటే. ఒక స్త్రీ పురుషులు తమకు సొంతం కాని పురుష స్త్రీ పురుషులతో సంభోగానానందము పొందితే అది వ్యభిచర్యము. సంభోగం శారీరికంగా జరిగితే వ్యభిచారమని, మానసికం అయితే అది మానసిక వ్యభిచారము అని అనాలి. అంటే కాని సాహితీ ప్రక్రియానురక్తులు కాదు వ్యభిచారులంటే ." శిలా సదృశంగా సాగుతున్న తన మాటలకు అడ్డు వేసే ధైర్యం చాలక వింటూ ఉండి పోయా.


"మానసిక వ్యభిచర్యానికి చాలా మంచి ఉదాహరణ నేటి మన చిత్ర వ్యవస్థ. చిన్న చిన్న గుడ్డ పేలికలు కట్టుకొని మన కథానాయికలు, ఫాషనంటూ వొల్లారబోసుకుంటున్న నవతరం కథా నాయకులూ, తెరపై గుడ్డల్లేని తోలు కనపడితే సివాలేసే వీర కళా పోషక ప్రేక్షకులు వీళ్ళందరూ చేసేది మానసిక వ్యభిచర్యము. నటీ నటుల చేత పలు సంభోగనా కదలికలను నృత్యం పేరుతొ చూపెడుతున్న నృత్య దర్శకులు, ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు వాళ్లకు భారీ పారితోషకాలు ఇస్తున్న నిర్మాతలూ వారి బ్రోకర్లు." గుక్క తిప్పుకోకుండా చెపుతున్న తను నాకు సప్తపదిలోని అమ్మవారులా కనపడింది.

నేను ఏదో అనబోయేంతలో "ఆగు. నన్ను చెప్పనియ్యి. అసలు నీకు నీ పై చాలా నమ్మకం తక్కువ. అన్నీ తెలుసు అనుకుంటావు కాని నిజంగా లోతుగా ఆలోచించావు.
ఏమిటి అనుకుంటున్నావు? నీ ఆర్కుట్ స్నేహితులు చాలా మంది అమ్మయిలేనా? నీవు నీ చిన్ననాటి స్నేహితులతో మాట్లాడుతున్న వారిలో ఎక్కువ మంది ఆడ స్నేహితులేనా? నీవు అభిరుచులు కలిసాయి అనుకుంటున్న బ్లాగ్స్లో ఎక్కువ శాతం ఆడవారివేనా? నువ్వు వీరందరితో నీ అభిరుచులు పంచుకోవటం, ఆ పంచుకోవటంలో ఆనందం కలగటంతో నీకు ఈ అనుమానం వస్తోందా?


ఛి సిగ్గు చేటు. చదువు ఒక్కటే సంస్కారం నేర్పదు ఆన్న దానికి ఉదాహరణే ఈ నీ సందేహం. ఒక స్త్రీ, పురుషులకు మధ్య ఉండే సఖ్యతకు పేరు పెట్టకండి అంటూ కాలేజీలో మైకు పట్టుకొని చెప్పిన నువ్వేనా ఇలా సందేహించేది? ఇతరులు "అన్నా చెల్లీ" అనుకుంటుంటే ఎందుకలా తమ మధ్య ఉన్న స్నేహానికి ఆ అప్రాకృతికమైన పేర్లు పెడతారు సమాజానికి భయపడి అని బాధ పడ్డ నీవేనా ఇలా ఆలోచించేది?

అభిరుచులు కలిసిన స్నేహితులు అబ్బాయైతే నీకేంటి? అమ్మాయి అయితే నీకేంటి? స్నేహంలో ఆనందం పొందటానికి వారు ఎవరైతే నీకెందుకు? నేను చెపుతా విను నీ ఈ అనుమానానికి అసలు కారణం. "ఆడ, మగల మధ్య ఏ సంబంధం అయినా సరే చివరికి శారీరిక సంబందానికే దారి తీస్తుంది" అన్న ఒక ఆలోచన ఎంత ఒద్దనుకున్నా నీలోంచి నీవు బయటకు తోయలేకపోతున్నావు. సగటు మనిషి ఆలోచనా ధోరణి అది. intelluctualgaa ఆ ఆలోచన తప్పు అని తెలిసినా మానసికంగా అది పోలేదు. మీరంతా ఈ సమాజములో ఈ విధంగా condition చేయబడ్డ pavlov కుక్కలు. మీరు deconditioning కావటానికి ఇంకా ఎత్తుకు ఎదగాలి మానసికంగా.

ఏమిటి? మనసా, వాచా, కర్మణా అన్నీ నీ భార్యతోనే అని బాస చేసావంటావా? అవును చేసావు. ఇప్పుడు నువ్వు త్రికరణ శుద్ధిగా లేవని ఎందుకు అనుమానం వచ్చింది? మీకు అభిరుచులు వేరయి సయోధ్య కుదరటానికి సమయం పడితే మాత్రం అలా అనుమాన పడాలా? ఇదేమీ మూడు గంటల సినిమా అనుకుంటున్నావా అన్నీ పది నిమిషాలలో సర్దుకుపోటానికి? ఇతరుల బ్లాగులలో చదవటం లేదా అభిరుచులు కలవని వారు, ముందు కలిగిన ఇబ్బందులను అధిగమించి, ఎంత సఖ్యతగా సంసారం చేసుకొంటున్నారో. మరెందుకంత అనుమానం నీ మీద నీ సంసారం మీద?

అసలు నిన్ను కాదు అనాల్సింది ఆ "మనసున మనసై, బ్రతుకున బ్రతుకై.........." అంటూ పాటలు రాసి, అలాటివి సినిమాలలో చూపి ప్రజలను ఇంతగా brain wash చేసే ఆ రచయితా/త్రులను అనాలి మీలాంటి వాళ్ళను పాడు చేస్తున్నందుకు. ప్రతి ఒక్కటీ అతికించినట్టు అభిరుచులు సరిపోయే జోడు దొరకటం అసాధ్యం అని ఎన్నడు గ్రహిస్తారు ఈ కాలం నాటి మీరు? ఎప్పుడు నేరుస్తారు సర్దుకు పోవటం అనే తీరు?

అభిరిచుల పునాది పైన నిర్మింపబడుతున్న ఈ రస రమ్య హర్మ్యాలను నీ ఈ అనుమానాలతో చిన్నా భిన్నం చేసే అధికారం నీకు లేదు. ఈ నీ అనుమానం నీకే కాదు అటు వైపు వారికి కూడా గొడ్డలి పేటని గ్రహించు.


మారుతున్న కాలంలో మీకు దొరికిన సువర్ణావకాశాలివి. అంతర్జాలము, బ్లాగు లోకము లాటి వినూత్న పరిణామాలు అభిరుచులు కలిసిన మీలాటి వారినెందరినో ఏకధారలో కలిపి, రసఝరిలో ముంచి తేల్చే నవీన భువన విజయాలు. అనవసర అనుమానాలతో నిన్ను, అవతలి వారినీ అవమానించకు, తెలుగు తల్లికీ, ఆ వాగ్దేవికీ మీరు చేస్తున్న సమిష్టి సువర్ణాభిషేకాలను కలుషితము చేయకు." అని చెప్పి ముగించి మాటా మాత్రమైనా చెప్పక అంతర్థానమైంది నా మనోజ.


"కొంచం శంకరాభరణం శంకర శాస్త్రి పాలు ఎక్కువైనట్టునాయి. అచ్చు ఆయన పలుకుల్లా వినిపిస్తున్నాయి మనోజ/నా మాటలన్నీ. ఇక విశ్వనాధ వారి సినిమాలకి కొంచం సెలవివ్వాలి" అనుకుంటూ గడియారం వైపు చూసా. బాబోయి అప్పుడే ఒకటిన్నర!!! ఇంక ఐదు గంటల్లో లేయాలి అని ముసుగు తన్ని పడుకున్నా సంతృప్త హృదయుడనై.

0 comments:

Post a Comment